మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే.. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై కాంగ్రెస్ నాయకులు మక్కాన్ సింగ్ ఆరోపణలు చేస్తున్నారని రామగుండం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు తానిపర్తి గోపాల్ రావు, జేవి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం స్థానిక ప్రధాన చౌరస్తాలోని బిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గత 60 ఏళ్ల కాలంలో జరగని అభివృద్ధి..ఎమ్మెల్యే చందర్ నేతృత్వంలో కేవలం నాలుగున్నర ఏండ్లలో జరగడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోవడం లేదన్నారు. చందర్ పై ప్రజల్లో నానాటికి పెరుగుతున్న అభిమానాన్ని తట్టుకోలేక, ఓటమి భయంతోనే మక్కాన్ సింగ్ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ప్రజల దశాబ్దాల చిరకాలవాంఛ అయిన మెడికల్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, కోర్టు భవన సదుపాయంతోపాటుగా నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చందర్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఏర్పాటు కావలసిన మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి, మెప్పించి నియోజకవర్గంలో ఏర్పాటయ్యేలా ఎమ్మెల్యే చందర్ కృషి చేశారన్నారు. స్థానిక యువత ఉపాధి కోసం తనవంతుబాధ్యతగా ఎమ్మెల్యే చందర్ అమెరికాకు వెళ్లి, అక్కడి ఐటి పారిశ్రామికవేత్తలతో సమావేశమై సానుకూల స్పందనను తీసుకువచ్చారని అన్నారు. మొక్కవోని పట్టుదలతో నియోజవర్గానికి మెడికల్ కళాశాల తీసుకువస్తే కాంగ్రెస్ నాయకులు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారేతప్ప..ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన చేయకపోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. మెడికల్ కళాశాలలో సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లలకు రిజర్వేషన్ తీసుకువస్తే.. ఇరవై తేలేదు..అరవై తెలీదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. నియోజకవర్గంలో కళ్ళ ముందే ఇంతగా అభివృద్ధి జరుగుతుంటే.. ఏమి జరగలేదు అనడం వారిలో దాగి ఉన్న కుట్రను బట్టబయలు చేస్తుందన్నారు. సింగరేణి స్థలాల్లో ఉన్న నివాసితులకు త్వరలోనే పట్టాలు అందించే విధంగా ఎమ్మెల్యే చందర్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రజలతోనే మమేకమై.. ప్రజా సంక్షేమం కోసం ఎమ్మెల్యే చందర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. గత ప్రజాప్రతినిధులు చేయలేని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే చేయడంతో ప్రజల్లో రోజురోజుకీ ఆదరణ పెరుగుతూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఓటమి భయం పట్టుకుందన్నారు. అభివృద్ధి అంటే వ్యక్తిగతంగా ఎదగడం కాదని.. ప్రజా సంక్షేమం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం తాపత్రయ పడడమని.. అందుకు నిదర్శనం ఎమ్మెల్యే చందర్ రని వారు అన్నారు. ఎమ్మెల్యే చందర్ పై అనవసర ఆరోపణలు చేస్తే రాబోయేకాలంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో రామగుండం కార్పొరేషన్ కో-ఆప్షన్ మెంబర్ వంగ శ్రీనివాస్ గౌడ్, బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు, తోడేటి శంకర్ గౌడ్, అడ్డాల రామస్వామి, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, జావిద్ పాషా, చెలుకలపల్లి శ్రీనివాస్, గుంపుల ఓదెలు యాదవ్, మేడి సదానందం, నీరటి శ్రీనివాస్, మండ రమేష్, అచ్చ వేణు, కలువల సంజీవ్,పిల్లి రమేష్, కాంపెల్లి సతీష్, దాసరి ఎల్లయ్య, అక్షర మల్లేష్, అదర్ సండే సమ్మా రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: