ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ 6 న కాజీపేటలోని శంకుస్థాపనకానున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థలాన్ని సందర్శించిన తరువాత పత్రిక సమావేశమును ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ వివరాలను సవివరముగా వివరించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏ కె గుప్తా , రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ విఎన్ఎల్) చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ మున్నా కుమార్ మరియు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
అరుణ్ కుమార్ జైన్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ ,భారత రైల్వేలకే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని తెలియజేశారు. ఈ యూనిట్ తెలంగాణలో ఏర్పాటవుతున్న తొలి భారతీయ రైల్వే తయారీయూనిట్ అని మరియు ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. అవసరాలకు అనుగుణoగా వివిధ రకాల రోలింగ్ స్టాక్‌లను ఉత్పత్తి చేస్తుందని ఆయన తెలియజేశారు. కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ ప్రాంతంలో కొత్త పారిశ్రామిక అభివృద్ధికి పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తు ప్రజల సామాజిక-ఆర్థిక పురోగతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు.
తొలుత కాజీపేటలో నెలకు 200 వ్యాగన్‌ల పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ (పి ఓఎచ్) చేపట్టేందుకు వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ మంజూరు చేయబడింది. ఈ ప్రాజెక్ట్ను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ విఎన్ఎల్)కు అప్పగించబడింది. ఆ తర్వాత, రైల్వే వ్యాగన్ల అవసరాలు పెరగడం, స్థానిక పరిశ్రమను ప్రోత్సహించడానికి, మరియు ఇతర విన్నపాలు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని కాజీపేటలోని 'వ్యాగన్ రిపేర్ షాప్'ను రూ సుమారు 521 కోట్లు అంచనా వ్యయంతో 'రైల్వే తయారీ యూనిట్'గా అభివృద్ధి చేయడము జరుగుతుంది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీచే ప్రారంభించబడిన ' ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కాజీపేటలోని రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం మరొక ప్రధానమైన అడుగు. ఈ తయారీ యూనిట్‌తో సంవత్సరానికి 1,200 వ్యాగన్లను తయారు చేయగల సామర్థ్యంతో ప్రారంభించబడుతుంది. రెండవ సంవత్సరం నుండి, సంవత్సరానికి 2,400 వ్యాగన్లను తయారు చేయగలుగుతుంది.
వ్యాగన్‌ల లభ్యతను మెరుగుపరచడం ద్వారా తయారీ యూనిట్ పరిశ్రమను ప్రోత్సహిస్తుంది. అదనంగా, రోలింగ్ స్టాక్ ఉత్పత్తి పెరగడం రాష్ట్ర ఆర్థిక వృద్ధిని మాత్రమే కాకుండా, దేశమంతటా కీలకమైన మరియు చాలా అవసరమైన భారీ వస్తువులను రవాణా చేయడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతుంది.

Post A Comment: