ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

గిరిజనుల ఆరాధ్య దైవం మేడారం  సమ్మక్క సారలమ్మ మినీ జాతర బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో జరుగుతున్న ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం ప్రారంభమైన జాతరలో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య, పిఓ అంకిత్, ఎస్పీ గౌస్ ఆలం లు  సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. మేడారం ఆలయ పూజారులు, అధికార సిబ్బంది వారికి స్వాగతం పలికారు. అమ్మవార్లకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం ఏర్పాటుచేసిన  మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మినీ జాతర జరుగుతున్న నేపథ్యంలో రూ.3కోట్ల 10 లక్షల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతర సంవత్సరానికి ఒకసారి జరిగే మినీ జాతరకు ఎంతో విశ్వాసంతో వేలాదిగా తరలివచ్చి భక్తులు దర్శించుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాకు అధిక ప్రాధాన్యతనిస్తూ  ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు చేసిందని, శాశ్వత భవనాలు నిర్మించిందని తెలిపారు.  రూ.19కోట్ల 50 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. సమగ్ర గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత ప్రాతిపదికన  అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. మినీ జాతరలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను చూసి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇటీవలె జిల్లాలో అనాధ పిల్లల భవన నిర్మాణం  కోసం భూమి పూజ చేసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, జిల్లా కేంద్రంలో 200 పడకల ఆసుపత్రి నిర్మాణం కొరకు ఆరోగ్యశాఖ మంత్రి చే భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. ఏటూరునాగారంలో డయాలసిస్ సెంటర్  

అక్టోబర్ మాసంలో ప్రారంభించుకోవడం జరిగిందని, మెడికల్ కాలేజీ మంజూరు కావడం జరిగిందని మంత్రి వివరించారు. అదే విధంగా గత ఏడాది మేడారం మహా జాతరను అధికార యంత్రాంగం విజయవంతం చేసిందని, ప్రస్తుతం జరుగుతున్న మినీ జాతరను  కూడా విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. అంతకుముందు కొండాయి గ్రామంలో  గోవిందరాజులు, నాగులమ్మల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ పాల్గొని పూజలు చేశారు.

దొడ్ల గ్రామంలోని  సారలమ్మ  తల్లిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య, ఏటూరు నాగారం  ఎంపీపీ  అంతటి విజయ, జిల్లా పరిషత్ కోఆప్షన్ నెంబర్ వలియాబి, జెడ్పి సీఈవో ప్రసూన రాణి, డి ఎం హెచ్ వో అప్పయ్య, డిపిఓ వెంకయ్య, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ హేమలత,  ఈవో రాజేందర్ పూజారి కాక భుజంగరావు, మేడారం సర్పంచ్  చిడం బాబురావు, ప్రధాన పూజారి సిద్ధ బోయిన జగ్గారావు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: