ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
బిజెపి పార్టీ నడుపుతున్న కేంద్రంలోని ప్రభుత్వం అడుగడుగునా పేదలు, ఉపాధి కూలీలు, కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని, పేదల పొట్టగొడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ వ్యతిరేక, పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్ గా ఉందని అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధులను కేటాయించకుండా, రాష్ట్రం చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా.. బడ్జెట్లో కోతలు విధించడం ద్వారా మరోసారి తన తెలంగాణ వ్యతిరేకతను బట్టబయలు చేసిందని తెలిపారు.
ఉపాధి హామీ పథకాన్ని నిర్విర్యం చేసే కుట్రతో ప్రతి ఏటా నిధుల కేటాయింపుల్లో కోతలు పెడుతోందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంపన్నులకు పెద్ద పీట వేస్తూ గ్రామీణ ప్రాంత కూలీలు, కార్మికుల పట్ల వివక్ష చూపుతోందన్నారు.
ఉపాధి హామీ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి రావలసిన దాదాపు 800 కోట్ల రూపాయలను ఇవ్వకుండా రకరకాల కొర్రీలు వేస్తూ... తాజాగా ఉపాధి హామీ పథకం కింద ఏకంగా 30 వేల కోట్ల రూపాయలను తగ్గించడం గ్రామీణ వ్యతిరేక బిజెపి ప్రభుత్వానికి నిదర్శనం అన్నారు. పల్లెల్లోని ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా, ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండకూడదనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకానికి ఏటేటా నిధులు తగ్గిస్తూ నిరుగారుస్తోంది అన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి కేవలం రూ.60వేల కోట్లను మాత్రమే కేటాయించిందన్నారు.
2022-23 గత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీకి రూ.89వేల కోట్లు కేటాయించిన కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరానికి 2023-24లో 30వేల కోట్ల రూపాయలకు పైగా కోత విధించడం దురదృష్టకరం అన్నారు.
అదే విధంగా గ్రామీణ సడక్ యోజన పథకానికి మూడేళ్లుగా బడ్జెట్ లో 19వేల కోట్ల రూపాయలనే కేటాయిస్తూ ఒక్క రూపాయి పెంచకపోవడం బట్టి గ్రామీణ భారత వ్యతిరేఖ ప్రభుత్వంగా చరిత్రలో బిజెపి ప్రభుత్వం నిలిచిపోతుంది అని ఎద్దేవా చేశారు. పేదలు, కార్మికులు, కూలీల పొట్టగొట్టి, రైతు వ్యతిరేఖ, గ్రామాల అభివృద్ది నిరోధక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి ప్రజలంతా కలిసి రానున్న ఎన్నికల్లో సమాధి కడతారని అన్నారు.

Post A Comment: