ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాలో అమలవుతున్న తొలిమెట్టు కార్యక్రమం పై శనివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే జిల్లాలో అమలవుతున్న మన ఊరు మన బడి పనులు వేగంగా కొనసాగించాలని ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష చేశారు.
జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సెక్టోరల్ అధికారులు, మండల ఎఫ్ ఎల్ ఎన్ నోడల్ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, డిపి ఏం యు సభ్యులతో ఆమె సమావేశం నిర్వహించి జిల్లాలో తొలిమెట్టు అమలు తీరును మండలాల వారీగా సమీక్షించారు. మండల నోడల్ అధికారులు, ప్రతినెల పాఠశాలలను సందర్శిస్తూ ఉపాధ్యాయుల బోధనా తీరును గమనిస్తూ, విద్యార్థుల ప్రగతిని పరిశీలించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతము ఆశించిన అభ్యసన సామర్ధ్యాలు విద్యార్థులు అందుకోవడానికి ఇబ్బందులు ఏమిటి, వాటిని ఎలా పరిష్కరించాలి అనే వాటి పై మండల తొలిమెట్టు నోడల్ అధికారులను అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు. ప్రాథమిక విద్యపై నిర్లక్ష్యం వహించవద్దని, ప్రతి పాఠశాలలో పాఠ్యప్రణాళిక, బోధనోపకరణాలు అనేటివి తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ఏ ఏ పాఠశాలలు మంచిగా పనిచేస్తున్నాయి, ఏ ఏ పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమము నిర్లక్ష్యానికి గురవుతుందో మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు. మండల విద్యాశాఖ అధికారులతో, మండల తొలిమెట్టు నోడల్ అధికారులందరితో కలెక్టర్ మాట్లాడించి ఇబ్బందులను అడిగారు. అయితే బోధనలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆమె తెలియజేశారు. అలాగే పదవ తరగతి విద్యార్థులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఎక్కువ 10/10 జిపిఏలు సాధించడానికి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు
దృష్టి పెట్టెలా తగు సూచనలు చేశారు. తల్లితండ్రుల సమావేశాలలో విద్యార్థుల ప్రగతిని ప్రదర్శింపచేయాలని, పాఠశాలలను సమాజానికి దగ్గరగా ఉంచితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని కలెక్టర్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ హై మాట్లాడుతూ మండల నోడల్ అధికారులకు, కాంప్లెక్స్ నోడల్ అధికారులకు తగు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఏ. శ్రీనివాస్, ప్లానింగ్ కోఆర్డినేటర్ పోరెడ్డి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారులు ఈసారి రవీందర్, రామ్ కిషన్ రాజు, రమాదేవి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Post A Comment: