ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

దేశానికే మార్గదర్శనం చేసే విధంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి సాధించిందని, మన చుట్టూ జరుగుతున్న విద్వేషాల పట్ల అవగాహన పెంచుకొని సమాజంలో చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన తదుపరి కలెక్టరేట్ ప్రాంగణం నుండి నూతనంగా నిర్మించిన జిల్లా గ్రంథాలయాన్ని ప్రారంభించారు.   

అనంతరం జిల్లా కలెక్టర్ ఛాంబర్ ను సందర్శించిన సీఎం కేసీఆర్, అక్కడ నిర్వహించిన సర్వ మత ప్రార్థనలో పాల్గొన్ని జిల్లా కలెక్టర్ కె.శశాంకను, మొదటి అంతస్తులో ఉన్న స్టేట్ ఛాంబర్ లో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలుపగా మంత్రివర్యులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం కలెక్టరేట్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ,*  ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్ ప్రాంతంలో  ఉన్న కరువు దుర్బర పరిస్థితులను చూసి కన్నీళ్ళు పెట్టుకున్నామని,  మహబూబా బాద్ లోని తిరుమలగిరి,  వర్ధన్నపేట పాలకుర్తి ప్రాంతాలలో సైతం దుర్భర కరువు కాటకాలతో ప్రజలు అలమటించారని  ఆనాటి పరిస్థితులను సీఎం కేసీఆర్  గుర్తు చేశారు.  

రామగుండం, మంచిర్యాల ప్రాంతాలలో పర్యటించే సమయంలో లెక్కలేనన్ని సార్లు నాణాలు గోదావరి నదిలో వెసి రైతుల గోస తీర్చాలని వేడుకున్నామని సీఎం పేర్కొన్నారు .

స్వామి దయ, మానుకోట రాళ్ల బలం, ప్రజల ఆకాంక్ష నెరవేరి మనకు ప్రత్యేక రాష్ట్రం లభించిందని, తరువాత అనేక ప్రజా రంజకమైన కార్యక్రమాలను అమలు చేసి అద్బుత విజయాలు సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రజలకు , ఉద్యోగులకు సౌకర్యార్థమైన విలాసవంతమైన సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించుకుంటున్నామని, ఇతర రాష్ట్రాలలో మంత్రుల ఛాంబర్ కంటే తెలంగాణలో జిల్లా కలెక్టర్ ఛాంబర్  అద్భుతంగా ఉందని పంజాబ్ మంత్రి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు.

నూతన జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు, నూతన కలెక్టరేట్ ప్రజా కార్యాలయంగా ఉండి అనేక సేవలు అందించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. 

మహబూబాబాద్ కేంద్రంలో నూతన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను సీఎం కేసీఆర్ మంజూరు చేస్తూ వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ హర్షద్వానాల మధ్య ప్రకటించారు.

మహబూబాబాద్, ములుగు భూపాల్ పల్లి జయశంకర్ ప్రాంతాలో జనాభా అధికంగా ఉన్న నేపథ్యంలో ఆర్మూరు ప్రాంతాలలో సైతం అభివృద్ధి కావాలని ఆకాంక్షించి  తాను పట్టుబట్టి జిల్లాలుగా ఏర్పాటు చేశానని అన్నారు. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధికి మచ్చు ఉదాహరణ ఏపి 60 ఏళ్ళలో  తెలంగాణ ప్రాంతంలో 3 మెడికల్ కళాశాలలు ఉంటే, 33 జిల్లా కేంద్రాలలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

మహబూబాబాద్  పై సీఎం కేసీఆర్ వరాలు, గ్రామపంచాయతీలు పట్టణాలకు 171 కోట్ల 10 లక్షలు మంజూరు

మహబూబాబాద్ లో ఉన్న 461 పంచాయతీలలో 283 గ్రామపంచాయ తీలను నూతనంగా మనం ఏర్పాటు చేశామని,  50 సంవత్సరాల పాటు  ఆదివాసి గిరిజన ప్రజలు  మా తండాలో మా రాజ్యమని కోరినప్పటికీ గత పాలకులు నెరవేర్చలేదని సీఎం కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ధైర్యం చేసి తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశామని, గిరిజన బిడ్డలు రాజులై తండాలను అద్భుతంగా బాగుచేసుకుంటు న్నారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి సీఎం ప్రత్యేక నిధుల నుంచి 10 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.

జిల్లాలో మహబూబాద్ మున్సిపాలిటీ చాలా మారిందని, స్థానిక మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే శాసనసభ్యులు అద్భుతంగా తీర్చిదిద్దారని, మహబూబాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లు, మిగిలిన 3 మున్సిపాలిటీలకు తలా 25 కోట్లను సీఎం స్పెషల్ గ్రాండ్స్ నుంచి కెసిఆర్ మంజూరు చేశారు.

జిల్లా అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులను స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో కార్యక్రమాలు రూపొందించి సద్వినియోగం అయ్యేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

నూతన రాష్ట్రంలో సంక్షేమ పథకాల జాతరను ప్రజలు అనుభవిస్తున్నారని, గతంలో  600 ఫీట్లు వేసిన నీరు ఉండేది కాదని, ప్రస్తుతం సమృద్ధిగా నీరు, కరెంట్ అందుబాటులో ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మన చుట్టూ ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని, రాష్ట్రం ఏర్పడే నాటికి మన జీఎస్డీపీ 5 కోట్లు ఉండేదని, ప్రస్తుతం 11.54 కోట్లకు చేరిందని అన్నారు .

దేశంలో నదులలో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉంటాయని, రైతుల పొలాల వద్దకు రావని, కృష్ణా నదిపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ 19 సంవత్సరాలు గడిచిన తీర్పు ఇవ్వదని సీఎం కేసీఆర్ తెలిపారు.  మనం మొండి పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకొని నీటి సమస్యలు లేకుండా చేసుకున్నామని అన్నారు.

దేశంలో సమృద్ధిగా నీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ నదులపై ఉన్న వివాదాలను తేల్చకుండా దేశ రాజధానిలో సైతం త్రాగునీటి సమస్య తీరలేదని,  ఈనాడు కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో త్రాగునీటి ఎద్దడి ఇంకా ఎందుకు ఉందని, 10 రోజులకు ఒకసారి సరఫరా చేసే దుస్థితికి కారణాలు ఆలోచించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. 

ప్రజలు అభివృద్ధి వైపు సాగాలంటే సమాజంలో శాంతి, సహనం అవసరమని, మత పిచ్చి, కుల పిచ్చి పెంపోందించి విద్వేషాలు రెచ్చగొడితే దేశం తిరోగమనం వైపు పయనిస్తుందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలో ఉన్న మేధావులు, యువకులు తాను చేసిన వ్యాఖ్యల పట్ల చర్చ చేయాలని, నిజా నిజాలను అందరికీ తెలియజేయాలని సీఎం కేసీఆర్ కోరారు.

తెలంగాణ తేజం నూకల రామచంద్రారెడ్డి కి తగిన రీతిలో గౌరవం

దేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయులు పీవీ నరసింహారావు  గురువు పెద్ద మేధావి మహబూబాద్ జిల్లాకు చెందిన నూకల రామచంద్రారెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో గౌరవిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. పీవీ నరసింహారావు కి గురువు నూకల రామచంద్రారెడ్డి అని, ఆయన పీవీ నరసింహారావు కి మంత్రి పదవి ఇవ్వకపోతే తాను తీసుకొకుండా పట్టుదల ప్రదర్శించి పివి గారిని ప్రోత్సహించారని, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ తేజాలను  పట్టించుకోలేదని , ప్రస్తుతం చిరస్థాయిగా వారి పేరు గుర్తుంచుకునే విధంగా జిల్లాలో ఏర్పాటు చేసే విద్యాసంస్థకు  వారి పేరు పెడతామని , మహబూబాబాద్, వరంగల్  పట్టణ కేంద్రాలో నూకల రామచంద్ర రెడ్డి   కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 


ఇంద్ర భవనంలో జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మాణం


గతంలో తాను కలెక్టర్ గా పని చేస్తున్న సమయంలో జిల్లాలో సరైన వసతులు ఉండేవి కాదని, ప్రస్తుతం ఇంద్ర భవనాల జిల్లా కలెక్టరేట్ లను నిర్మించి ఉద్యోగులకు ప్రజలకు మెరుగైన సౌకర్యాలను సీఎం కేసీఆర్ కల్పిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంతి కుమారి తెలిపారు. 

మన రాష్ట్రం ఏర్పడే నాటికి 62,000 కోట్లు ఉన్న ఆదాయం మూడు రెట్లు పెరిగి ప్రపంచమే ఆశ్చర్యపోయే అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని సిఎస్ అన్నారు.

సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో  రాష్ట్రంలో 33 జిల్లాలను, మండలాలు గ్రామాలను ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో ప్రభుత్వ పాలన అందిస్తున్నామని అన్నారు. 

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరే విధంగా  ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ద్వారా చర్యలు తీసుకుంటామని సీఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర సి. ఎస్. శాంత కుమారి, సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, జడ్పీ చైర్ పర్సన్ అంగోతు బిందు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ మాలోతు కవిత, పసునూరి దయాకర్, శాసనమండలి సభ్యులు పల్ల రాజేశ్వర్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, తాతా మధుసూధన్ రావు, శాసనసభ్యులు శంకర్ నాయక్, డి.ఎస్. రెడ్యా నాయక్, డి.అనసూయ, బానోత్ హరిప్రియ నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, డి.ఎఫ్.ఓ. రవి కిరణ్, అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, ఎం.డేవిడ్, ట్రైనీ కలెక్టర్ పింకేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్,  వరంగల్ మునిసిపల్ మేయర్ గుండు సుధారాణి, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత జిల్లా అధికారులు,   తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: