ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
ఉపాధ్యాయులు అందరూ లెసన్ ప్లాన్ తయారు చేసి, దాని ఆధారంగా నే పాఠాలు బోధించా లని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.
శుక్రవారం నాడు కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో అమలవుతున్న తొలిమెట్టు కార్యక్రమం పై మండల విద్యాశాఖ అధికారులు, మండల ఎఫ్. ఎల్ .ఎన్. నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ మండలాలలో తొలిమెట్టు కార్యక్రమం అమలు తీరుపై మండల నోడలు అధికారులను, మండల విద్యాశాఖ అధికారులను అడిగి కార్యక్రమ అమలు తీరును తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు . దీని అమలు కోసం ఉపాధ్యాయులను ఎంపిక చేసి తగిన శిక్షణ ఇచ్చామన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేయాలన్నారు. ప్రాథమిక విద్యలో ఎన్ ఏఎస్ నివేదికల ప్రకారం జిల్లా వెనుకబడి ఉందని, కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసన స్థాయిలు మందగించాయని, వీటిపై ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టాలని అన్నారు. తొలి మెట్టు కార్యక్రమము మరింత మెరుగుగా జిల్లాలో అమలు పరచడానికి తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యార్థుల హాజరు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రెండు మూడు రోజులు ఒక విద్యార్థి గైర్హాజరయితే కారణాలు అన్వేషించి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించలని అన్నారు. విద్యార్థులందరూ 100% హాజరు ఉండేట్టుగా ఉపాధ్యాయులు చూడాలని కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రుల సమావేశాల్లో విద్యార్థుల హాజరు పై చర్చించాలని ఆయన ఉపాధ్యాయులకు తెలిపారు. మండల నోడల్ అధికారులను వారి వారి మండలాలలో అమలవుతున్న కార్యక్రమములు, ఎదుర్కొనే ఇబ్బందులతో పాటు తగు సూచనలు అందించారు. ఇకనుండి ప్రతి నెల తొలిమెట్టుపై సమీక్ష , పర్యవేక్షణ చేస్తానని అన్నారు. జిల్లా ఉన్నత అధికారులతో కూడా సమ్మేటివ్ -1 పరీక్షల అనంతరం ప్రాథమిక పాఠశాలలను సందర్శిస్తారని అన్నారు. తాను కూడా పలు పాఠశాలలను సందర్శిస్తానని అన్నారు. పాఠ్యప్రణాళికలు, బోధనోపకరణాలు తరగతి గది బోధనలో వాడాలని, ఎలాంటి నిర్లక్ష్యం ఉపాధ్యాయులు చూపరాదని తెలియజేశారు. కాంప్లెక్స్ సమావేశాలలో పాఠ్యప్రణాళికల రచనపై అలాగే బోధనోపకరణాల ప్రదర్శన పై శ్రద్ధ వహించాలని నిర్లక్ష్యంగా ఉండే ఉపాధ్యాయుల వివరాలు తనకు అందించాలని తెలిపారు. తొలిమెట్టు కార్యక్రమములో భాగంగా ఉపాధ్యాయులకు అందించిన శిక్షణ గురించి పాఠశాలలకు అందజేసిన మాడ్యూల్స్ గురించి ఆయన అరా తీశారు . ఈ శిక్షణలో పాల్గొన్న రిసోర్స్ టీచర్లను ఆయన అభినందించారు.
బోధనలో సీత ఆదర్శం ...
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, హసన్పర్తి లో పనిచేస్తున్న ప్రాథమిక ఉపాధ్యాయురాలు బి. సీతను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు . బి. సీత దివ్యాంగురాలైన ఉపాధ్యాయురాలు అయినప్పటికీ తను పాఠ్యప్రణాళికలు రాసి, బోధనోపకరణాలు స్వయంగా తయారు చేసి, తరగతి గదిలో బోధన చేస్తున్న తీరును అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, జిల్లా కలెక్టర్ ఆమె యొక్క పాఠ్యప్రణాళికలను, బోధనోపకరణాలను ప్రత్యేకంగా పరిశీలించారు జిల్లాలోని ప్రతి ఉపాధ్యాయుడు దివ్యాంగురాలైన సీతను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని కోరారు. శారీరకంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ తను పాఠ్యప్రణాళికలు రాసి, తయారుచేసిన బోధనోపకరణాలు అద్భుతంగా ఉన్నాయని, విద్యార్థులు ఇలాంటి బోధనోపకరణాలు వాడితే అభ్యసన సులువు అవుతుందని సీతను కలెక్టర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి D. వాసంతి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. శ్రీనివాస్, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బి. రాధ, ప్లానింగ్ కోఆర్డినేటర్ పి. శ్రీనివాస్, జెండర్ కోఆర్డినేటర్ బి. జయ, మండల విద్యాశాఖ అధికారులు రామ్ కిషన్ రాజు, వెంకటేశ్వరరావు, రమాదేవి, రవీందర్ ఎఫ్. ఎల్. ఎన్. మండల నోడల్ అధికారులు రామ్ ధన్, వేణు ఆనంద్, రవికుమార్, సాంబశివరెడ్డి, రిసోర్స్ టీచర్లు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Post A Comment: