ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
శాస్త్రీయ సమాజ నిర్మాణంలో జన విజ్ఞాన వేదిక కృషి అభినందనీయమని హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. చెకుముకి సైన్స్ సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను సోమవారం నాడు ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సమాజ చైతన్య కార్యక్రమాలు, మూఢనమ్మకాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై జన విజ్ఞాన వేదిక ప్రజలను చైతన్యం చేయడం అభినందనీయం అన్నారు. జేవివి రాష్ట్ర నాయకులు నిట్ ప్రొఫెసర్.కె లక్ష్మారెడ్డి మాట్లాడుతు విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించి వారిలోని సృజనాత్మక శక్తులను వెలికి తీయడానికి శాస్త్రీయ ఆలోచనలు, పరిశీలన శక్తిని పెంపొందించడానికి అధ్యయనాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచడం ద్వారా శాస్త్రవేత్తలుగా ఎదగడానికి తోడ్పడే విధంగా సైన్స్ సంబరాల కార్యక్రమం రూపొందించామని తెలిపారు. హనుమకొండ జిల్లా అధ్యక్షులు నిట్ ఆచార్యులు కాశీనాథ్ మాట్లాడుతు పాఠశాల స్థాయిలో ఈనెల 18న, మండల స్థాయిలో 22న, జిల్లాస్థాయిలో 27న చెకుముకి సైన్స్ ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు డాక్టర్ రాములు, ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు, కనకాచారి, మురళీమోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: