ఉమ్మడి వరంగల్ : మాడుగుల శ్రీనివాస శర్మ
హన్మకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ వి.బి.నిర్మలా గీతాంబ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్- సెప్టెంబర్, 13వ తేదీ శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించతలపెట్టామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వరంగల్ వి.బి.నిర్మలా గీతాంబ తెలియజేశారు.
ఈ సందర్భంగా న్యాయ సేవా సదనం బిల్డింగ్ లో రెండు వేర్వేరు సమావేశాలను నిర్వహించడం జరిగింది. మొదటగా వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఇన్సూరెన్స్ సంబంధ, చిట్ ఫండ్ కంపెనీ మరియు బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఆ తర్వాత వరంగల్ జిల్లా వివిధ న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ " సెప్టెంబర్ 13, శనివారం రోజున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్, వివాహ /కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్, బ్యాంకు, చిట్ ఫండ్, ఎక్సైజ్ కేసులు, ఎలక్ట్రిసిటీ సంబంధ కేసులను మరియు రాజీ పడదగు ఇతర కేసులు పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కనుక ఇన్సూరెన్స్ బ్యాంకు మరియు చిట్ ఫండ్ అధికారులు కోర్టులలో పెండింగ్ లలో ఉన్న తమ తమ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించుకొని లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని కోరారు.కోర్టులలో లేని కేసులను ప్రీ- లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థ లో పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రి-లిటిగేషన్ కేసుల విషయాలలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గారిని సంప్రదించాలని తెలిపారు. ఇన్సూరెన్స్, బ్యాంక్ మరియు చిట్ ఫండ్ కేసుల పరిష్కారం కొరకు ఏవైనా సలహాలు, సూచనలు అవసరమైనట్లయితే న్యాయసేవాధికార సంస్థ ను నేరుగా సంప్రదించి ఉచిత సలహాలు పొందవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ పట్ల వారి వారి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని, ఎక్కువ కేసులు పరిష్కరించబడుటకు న్యాయవాదులు, చిట్ ఫండ్, బ్యాంకు ఇన్సూరెన్స్ అధికారులు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకునేలా సహకరించాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ లో అధిక కేసుల పరిష్కారానికి తేదీ:01.09.2025 నుండి ప్రి-లోక్ అదాలత్ ను న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ ఆధ్వర్యంలో ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రి-లోక్ అదాలత్ కక్షిదారుల కేసును ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి సులభతరం అవుతుందని భావిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో కో-ఆపరేటివ్ సొసైటీ ట్రిబ్యునల్ కోర్టు ఛైర్మన్-న్యాయమూర్తి నారాయణ బాబు, న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి యం.సాయికుమార్, వరంగల్ జిల్లా న్యాయమూర్తులు, వరంగల్ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వలుస సుధీర్, బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్ ఫండ్ అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: