ఈ ఏడాది గణపతి నవరాత్రుల సమయంలో సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ కారణంగా గ్రహణం ప్రారంభమయ్యే సమయానికంటే ముందే గణపతి నిమజ్జనాన్ని పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులకు సూచనలు జారీ చేస్తున్నారు. గ్రహణ సమయంలో పూజలు, శుభకార్యాలు, దేవతా విగ్రహాల దర్శనం వంటివి నిషిద్ధం కాబట్టి, గ్రహణ కాలానికి ముందే గణపతి నిమజ్జనం చేస్తే శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
సాధారణంగా గణపతి నవరాత్రుల తర్వాత కొందరు భక్తులు ఐదు, ఏడు, పది రోజుల పాటు తమ ఇళ్లలో గణపతిని ఉంచుకుని నిమజ్జనం చేస్తారు. అయితే, ఈసారి చంద్రగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని, తప్పనిసరిగా పదో రోజున నిమజ్జనం పూర్తి చేయాలని సలహా ఇస్తున్నారు.
దీంతో, భక్తులు సెప్టెంబర్ 7న నిమజ్జనం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్టితో మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నారు. నిమజ్జనం కోసం చెరువులు, కుంటలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిమజ్జన ట్యాంకులను ఉపయోగిస్తున్నారు. చంద్రగ్రహణం వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటానికి, పవిత్రమైన గణపతి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేందుకు పండితుల సూచనలను పాటించాలని అధికారులు, ఉత్సవ నిర్వాహకులు కోరుతున్నారు.
Post A Comment: