కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ, దేశంలో మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, 'ఆపరేషన్ కగార్' ఉధృతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. వర్షాకాలంలో కూడా భద్రతా దళాల కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతాయని ఆయన తెలిపారు. మావోయిస్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని షా కుండబద్దలు కొట్టారు. "మావోలతో చర్చల ప్రసక్తే లేదు. వారు తమ సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలి. లేదంటే, వారిని ఎప్పటికీ నిద్ర పోనివ్వం" అని ఆయన గట్టి హెచ్చరిక చేశారు.
దేశాన్ని 2026 నాటికి మావోయిస్టు రహితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమిత్ షా ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భద్రతా దళాలు పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యాయని ఆయన నొక్కి చెప్పారు. ఇటీవలి కాలంలో మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించడంలో ప్రభుత్వం గణనీయమైన విజయం సాధించిందని, వారి కంచుకోటలను ఛేదించి, మారుమూల ప్రాంతాల్లో కూడా భద్రతా దళాల ఉనికిని పెంచిందని ఆయన పేర్కొన్నారు. 'ఆపరేషన్ కగార్' అనేది ఈ విస్తృత వ్యూహంలో భాగమని, మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించే వరకు ఇది కొనసాగుతుందని షా స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు భద్రత కల్పించడం, అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడం కూడా ఈ ఆపరేషన్‌లో అంతర్భాగమని ఆయన తెలియజేశారు.

Post A Comment: