భూపాలపల్లి జిల్లా: తల్లి వదిలేసి వెళ్లడం, తండ్రి తాగుడుకు బానిసై పట్టించుకోకపోవడంతో చదువుకు దూరమై బాల్య కార్మికురాలిగా మారిన ఒక 14 ఏళ్ల చిన్నారికి ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి మానవతా దృక్పథంతో స్పందించి, ఆ చిన్నారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.

భూపాలపల్లి మండలం, గూడాడుపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్రీజ (14) చిన్నతనంలోనే తల్లి వదిలేసి వెళ్ళిపోయింది అప్పటి నుండి ఆమె తండ్రి మానసికంగా కృంగిపోయి, తాగుడుకు బానిసయ్యాడు. దీంతో శ్రీజను పట్టించుకునే వారు కరువయ్యారు. చదువు మానేసిన శ్రీజ, వేరే ఊరిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.

శ్రీజ దయనీయ పరిస్థితిని గమనించిన గూడాడుపల్లికి చెందిన యువకుడు చంద్రగిరి శ్రీకాంత్, ఈ విషయాన్ని ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందిన వెంటనే ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి స్పందించారు. ఆయన చిన్నారి శ్రీజ దగ్గరికి వెళ్లి ఆమె పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు.

వెంటనే శ్రీజకు అవసరమైన కొత్త బట్టలు, పుస్తకాలు, పెన్నులు మరియు ఇతర సామాగ్రిని కొనిచ్చారు. అంతేకాకుండా, ఆమె భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, చిట్యాలలోని కస్తూర్బా హాస్టల్‌లో చేర్పించారు.

ఈ సందర్భంగా చైర్మన్ అయిలి మారుతి మాట్లాడుతూ, శ్రీజ పూర్తి బాధ్యతలను తమ ఫౌండేషనే చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆమె ఉన్నత చదువులకు కూడా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని, భవిష్యత్తులో ఆమె వివాహాన్ని కూడా తామే చేస్తామని ప్రకటించారు. శ్రీజ పరిస్థితిని తమ దృష్టికి తెచ్చిన చంద్రగిరి శ్రీకాంత్‌ను అయిలి మారుతి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కష్టాల్లో ఉన్న మరికొందరు ఉంటే తమ ఫౌండేషన్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చిట్యాల మండల ఇంచార్జ్ లౌడియ రాజునాయక్, దుగ్యాల స్వామి తదితర సభ్యులు పాల్గొన్నారు.




Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: