ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ధ్రువీకరణ కోసం ఏర్పాటు చేసిన అధికారుల బృందాలు వాటిని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి ఆ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియ పురోగతి, వాటికి సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ధ్రువీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రతి బృందం రోజుకు ఇరవై దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను అదే రోజు అందజేయాలన్నారు. ధ్రువీకరణ కోసం ఏర్పాటు చేసిన అధికారుల బృందాలలో కొందరు ఇటీవల బదిలీ కాగా దీనిపై కలెక్టర్ స్పందిస్తూ బదిలీ అయిన వారి స్థానంలో కొత్తగా వచ్చిన వారికి తగిన తర్ఫీదు ఇచ్చి క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన కోసం రెవెన్యూ, మున్సిపల్, సాగునీటిపారుదల శాఖల అధికారులతో 23 బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా ఎల్ఆర్ఎస్ నోడల్ అధికారి కె. శంకర్ కుమార్, కుడా పీవో అజిత్ రెడ్డి, పరకాల మున్సిపల్ కమిషనర్ నరసింహ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిటీ ప్లానర్ రవీంద్ర రడెకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: