ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండజిల్లా లోని పరకాల నియోజకవర్గ పరిధిలో యువతకు, మెగా టెక్స్టైల్ పార్కు కోసం భూములిచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖల అధికారులతో పరకాల నియోజకవర్గ పరిధిలో మెగా జాబ్ మేళా, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో సంగెం, గీసుకొండ తో పాటు ఇతర మండలాల స్థానికులకు ఉపాధి కల్పన, తదితర అంశాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ పరిధిలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు టెక్స్టైల్ పార్కు కోసం భూములు ఇచ్చిన వారి నుండి మొత్తం 3836మంది ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి వివిధ సంస్థలలో ఉపాధి కల్పనకు పూర్తిస్తాయి నివేదికను అధికారులు రూపొందించాలన్నారు. ఉపాధి కల్పనపై రెండు జిల్లాల కలెక్టర్లు, అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ పరిశ్రమల్లో విడతల వారిగా ఉపాధిని కల్పంచాలన్నారు. 18 నుండి 35 ఏళ్ల వయసు వారికి ముందుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆ తదుపరి మిగతా వయసుల వారికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వివిధ ఉపాధి అవకాశాలకు వచ్చిన దరఖాస్తులలో అర్హతలను ముందుగా పరిగణనలోకి తీసుకుని వారి జాబితాను సిద్ధం చేస్తే వివిధ సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మార్గం సుగమమౌతుందన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో సెట్విన్ ఎండి మన్మోహన్, పరిశ్రమలు, ఉపాధి కల్పన, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: