ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జూలై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 అమలులోకి రానున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. నూతన చట్టాలపై ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులకు, సిబ్బందికి నెల రోజుల పాటు శిక్షణ, అవగాహన కార్యక్రమ ముగింపు కార్యక్రమం నిర్వహించగా ఎస్పి కిరణ్ ఖరే పాల్గొని నూతన చట్టాల నిర్వహణతోపాటు, విచారణలో పాటించవలసిన నూతన విధానాలపై పోలిసు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ, అమల్లోకి రానున్న కొత్త చట్టాలు మనదేశ అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని పేర్కొన్నారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతులలో మార్పు వస్తుందని, ప్రజలకి మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.
భారత్ స్వతంత్రదేశంగా మారిన తర్వాత కూడా వలస పాలన నాటి న్యాయచట్టాల ప్రకారమే నేరన్యాయ వ్యవస్థ, శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థ నిర్వహించడం జరుగుతోందని ఎస్పి గుర్తు చేశారు. ఇన్నేళ్లలో భారత న్యాయ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, అవసరాన్ని బట్టి ప్రజాభద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు అమలులోకి రానున్న నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం మనదేశ శాంతిభద్రతల పరిరక్షణలో ఒక మైలురాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన చట్టాల కార్యక్రమ ఇంచార్జీ డిఎస్పి నారాయణ నాయక్, భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, రత్నం జిల్లా పరిధిలోని ఎస్సైలు పోలిసు పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: