ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
భారతదేశ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీకైనా రెజ్లింగ్ క్రీడలో జాతీయస్థాయిలో తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
రాష్ట్రస్థాయి అండర్ -15, అండర్-20 రెజ్లింగ్ చాంపియన్ షిప్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు సోదర స్నేహ భావానికి చిహ్నం అన్నారు. క్రీడల్లో భాగస్వాములైన యువత అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉందన్నారు. బాల్యం నుండే తమకు ఆసక్తి ఉన్న ఏదైనా ఒక క్రీడారంగంలో చిన్నారులు శిక్షణ పొందాలన్నారు. క్రీడలతో క్రమశిక్షణ అలవర్చుకుంటూ ఉజ్వల భవిష్యత్ పొందవచ్చు అన్నారు.
తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ అడ్హక్ కమిటీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులకు ఉచితంగా భోజన వసతి సౌకర్యం కల్పించడమే కాకుండా ఏ విధమైన ఎంట్రీ ఫీజు లేకుండా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తున్న క్రీడ రెజ్లింగ్ అన్నారు. గత ఏడాదికాలంగా ఇబ్బందులు ఎదుర్కొన్న రెజ్లింగ్ క్రీడాకారులకు కొత్త రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రెజ్లింగ్ క్రీడాభివృద్ధికి పూర్తిగా సహకరించనున్నట్లు చెప్పారు. తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ కరీం మాట్లాడుతూ తెలంగాణలోని 33 జిల్లాల నుండి దాదాపు 600 మంది క్రీడాకారులు ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈనెల 11 నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నుండి గ్వాలియర్ లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీలను అతిథులు లాంఛనంగా ప్రారంభించారు. అతిథులను రాష్ట్ర రెజ్లింగ్ సంఘం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో శాట్స్ పరిశీలకులు , డివైఎస్వో జి.అశోక్ కుమార్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ వరద రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, వరంగల్ జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బి.కైలాసం యాదవ్, వివిధ జిల్లాల రెజ్లింగ్ సంఘాల బాధ్యులు ఎస్.రాజ్ కుమార్, జైపాల్, షేక్ రియాజ్, కాశీ హుస్సేన్, బి.సాయిలు, టి.శ్రీనివాస్, రవిలు పాల్గొన్నారు.
Post A Comment: