ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
క్రిస్మస్ పర్వదినానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో వివిధ శాఖల అధికారులు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులతో క్రిస్మస్ పండుగ నిర్వహణపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ తో పాటు అన్ని పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. పండుగల నిర్వహణలో అందరి సహాయ సహకారాలు అవసరమని పేర్కొన్నారు. సమన్వయంతో పండుగ నిర్వహించి ప్రత్యేకంగా పేరును తీసుకురావాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి వెయ్యి దుస్తుల పంపిణితోపాటు, ఫీస్ట్ నిర్వహణకు రెండు లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. క్రిస్మస్ పండుగ నిర్వహణలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. పండుగ నిర్వహణలో ఏ సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి ఎం.ఏ భారీ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చెపడతామన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ అనిసూర్ రషీద్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ తరపున ఏర్పాట్లు చేస్తామని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ రోజున చర్చిల వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి జగదీష్ మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీల తరపున గ్రామాల్లో క్రిస్మస్ ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఈ సందర్భంగా పాస్టర్లకు, క్రైస్తవులకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు, క్రైస్తవులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా కేకును కట్ చేయించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఇ.వి శ్రీనివాసరావు, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు ఎల్. రమేష్, శ్రీనివాస్, ఏసీపి కిరణ్ కుమార్, పాస్టర్లు ఐజాక్, మంద కుమార్, ఇమ్మానుయేల్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: