ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను పరకాల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
మహాలక్ష్మి పథకం లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం జీరో చార్జీ టికెట్ అందించడం జరుగుతుందని, ఇది మహిళా సాధికారతకు దోహదపడడంతో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలలో భాగంగా ప్రారంభించిన ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్ జెండర్ లు కూడా ఉచితంగా ప్రయాణించ వచ్చని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా బలోపేతం చేస్తూ రూపాయలు ఐదు లక్షల నుంచి రూపాయలు 10 లక్షలకు పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆర్టీసీ బస్సు ముందు ఎమ్మెల్యే పచ్చ జెండాను ఊపి ఆర్టీసీ బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ శ్రీనివాస్, పురపాలక కమిషనర్ శేషు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, ఇతర అధికారులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: