ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హనుమకొండ జిల్లా పరిధిలోని రెండు నియోజకవర్గాలైన వరంగల్ పశ్చిమ , పరకాలలో హోమ్ ఓటింగ్ మంగళవారం ప్రారంభమైంది. 12డి ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు, ఎనభై ఏళ్ళ వయసు పైబడిన వృద్ధులు హోమ్ ఓటింగ్ విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈనెల 30వ తేదీన పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోలేని ఫారం 12డి ద్వారా దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు, ఎనభై ఏళ్ల వృద్ధులు ఫారం 12డి ద్వారా దరఖాస్తు చేసుకుని పోస్టల్ బ్యాలెట్ విధానంలో తమ ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఎలక్షన్ కమిషన్ హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఇందులో భాగంగానే జిల్లాలోని రెండు నియోజకవర్గాలైన వరంగల్ పశ్చిమ, పరకాలలో హోమ్ ఓటింగ్ ను అధికారులు చేపట్టారు.
జిల్లాలో 21, 22,23 తేదీల్లో హోమ్ ఓటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో హోమ్ ఓటింగ్ను నిర్వహించారు. మంగళవారం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకూ హోమ్ ఓటింగ్ ను నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 363మంది దివ్యాంగులు, ఎనభై ఏళ్ల వయసు పైబడిన వృద్ధులైన ఓటర్లు ఉన్నారని, పరకాల నియోజకవర్గంలో 302మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 11బృందాలు, పరకాల నియోజకవర్గంలో 6 బృందాలు హోమ్ ఓటింగులో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో హోమ్ ఓటింగు కు దరఖాస్తు చేసుకున్న ఓటర్లలో 236మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. అదేవిధంగా పరకాల నియోజకవర్గంలో 143మంది ఓటర్లు తమ ఓటును వేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మొదలైన హోమ్ ఓటింగ్ విధానాన్ని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డాక్టర్ హె చ్. ఎన్. గోపాలకృష్ణ, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఇతర అధికారులు పరిశీలించారు. హోమ్ ఓటింగ్ కు చేపట్టిన చర్యలను ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రిసైడింగ్, అదనపు పోలింగ్ అధికారులు, సెక్టార్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లను అడిగి తెలుసుకుని హోమ్ ఓటింగును పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. హోమ్ ఓటింగును చేపడుతున్నప్పుడు వీడియోగ్రఫీ తప్పకుండా చేయాలని ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులకు తెలియజేసారు.
Post A Comment: