ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన లక్ష రూపాయల లోపు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పథకం ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.
బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో రుణమాఫీ, జి. ఓ. 58, 59, గృహలక్ష్మి, ఆసరా పెన్షన్, నివాస స్థలాల పట్టాల పంపిణీ, గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం, తెలంగాణకు హరితహారం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రుణమాఫీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ , హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణమాఫీ పథకం సంబంధించి నిధులు బ్యాంకులలో జమ చేయడం జరిగిందని, అర్హత గల రైతుల ఖాతాల వివరాలు అందించని వారి వివరాలు సేకరించి పోర్టల్ బ్యాంకుల వారీగా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టడంతో పాటు వ్యవసాయ సాగుకు అవసరమైన ఎరువుల నిల్వలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ భూములలో నివాసం ఏర్పాటు చేసుకున్న అర్హులైన వారి భూముల క్రమబద్ధీకరణ కొరకు ప్రభుత్వం జి. ఓ. నం. 58, 59 ద్వారా అవకాశం కల్పించి లబ్ధిదారులకు పట్టాలు అందించడం జరిగిందని, go 59 క్రింద దరఖాస్తు చేసుకున్న వారికి నోటీసులు అందించడం జరిగిందని తెలిపారు , జి ఓ నిబంధనల మేరకు ప్రభుత్వ రుసుము చెల్లించిన వారి భూముల క్రమబద్ధీకరణకు చర్యలు తెలిపారు. ఇంటి నివాస స్థలం కలిగిన అర్హులైన వారికి ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద అందిస్తున్న ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకున్న వారి సంబంధిత వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఆసరా పెన్షన్ పొందుతూ మరణించిన పెన్షన్ దారు స్థానంలో కుటుంబ సభ్యులలో అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములలో నివాస స్థలాలకు పట్టాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేసి మరింత సాగు విస్తీర్ణం పెంచే విధంగా రైతులను ప్రోత్సహిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ హరితహారం పథకం కింద జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టడంతో పాటు సంపద వనాల క్రింద మొక్కలు నాటేందుకు ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్సు లో అదనపు కలెక్టర్ మహేందర్ జీ ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల డిఆర్డిఏ పిడి శ్రీనివాస్ కుమార్ వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: