ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

అర్హులకు ప్రభుత్వ పథకాలు సత్వరమే అందేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి  తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి , ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, నోటరి భూముల క్రమబద్ధీకరణ, బీసి, మైనారిటీ లకు లక్ష ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, దళిత బంధు వంటి పలు అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, తెలంగాణకు హరితహారం క్రింద ఉన్న లక్ష్యాలను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని, దానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా  రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు కోటి మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తింపు, గుంతల తవ్వకం చేపట్టాలని అన్నారు. 

నీటి పారుదల శాఖ పరిధిలోని భూములలో ఏర్పాటు చేస్తున్న సంపద వనాలలో లక్ష్యం మేరకు మొక్కలు నాటే ప్రక్రియ 2 వారాల్లో పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. జిల్లాలో హరితహారం క్రింద మొక్కలు నాటడంతో పాటు మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని సీఎస్ తెలిపారు.

గొర్రెల పంపిణీ పథకం క్రింద జిల్లాలకు ఇప్పటి వరకు నిర్దేశించిన లక్ష్యం త్వరితగతిన చేరుకోవాలని సీఎస్ సూచించారు. ఈ వారం నుంచి ప్రతి జిల్లాకు గొర్రెల యూనిట్ల పంపిణీ లక్ష్యం రెట్టింపు చేశామని, గొర్రెల యూనిట్ల కొనుగోలు వేగవంతం చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సీఎస్ పేర్కొన్నారు. గొర్రెల యూనిట్ల కొనుగోలు బృందంలో జిల్లా స్థాయి అధికారి తప్పనిసరిగా ఉండాలని అన్నారు. జిల్లాలో స్థానిక ప్రజా ప్రతినిధులచే గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని, సదరు సమాచారం సామాజికమాధ్యమాల్లో ప్రచారం చేయాలని సిఎస్ తెలిపారు. 

బీసి కులవృత్తుల లక్ష రూపాయల ఆర్థిక సహాయం క్రింద మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 300 మంది లబ్దిదారులకు అందించడం జరుగుతుందని, దీనికి సంబంధించిన నిధులు జిల్లాలకు విడుదల చేశామని, ప్రతి అసెంబ్లీ పరిధిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యేలతో ఆగస్టు 10 లోపు చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ సూచించారు.  

మైనారిటీల సంక్షేమం క్రింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకంలో జనాభా ప్రాతిపదికన జిల్లాలకు లక్ష్యాలు నిర్దేశించామని అన్నారు. జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు లబ్దిదారులను ఎంపిక చేసి ప్రోసిడింగ్స్ జారీ చేయాలని, ప్రోసిడింగ్స్ జారీ చేసిన వెంటనే  నిధులు మంజూరు అవుతాయని చెక్కుల పంపిణీ చేపట్టవచ్చని అన్నారు. 

గృహలక్ష్మి పథకం క్రింద జిల్లాలో తహసిల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆగస్టు 10 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి గృహలక్ష్మి క్రింద 3 వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇప్పటి వరకు జిల్లాలో ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను, ఆగస్టు 10 వరకు వచ్చే దరఖాస్తుల జాబితా రూపొందించి ఆగస్టు 20 నాటికి క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. జిల్లా ఇంఛార్జి మంత్రిచే లబ్దిదారుల జాబితా ఆమోదింపజేసుకొని ఆగస్టు 25 నాటికి గృహలక్ష్మి ఇండ్ల మంజూరు పూర్తి చేయాలని అన్నారు. 

రెండవ దశలో  ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి 1100 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం అమలు చేయాలనిప్రభుత్వం నిర్ణయించిందని సీఎస్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్థానిక ఎమ్మెల్యే లో సమన్వయంతో దళిత బంధు లబ్దిదారులను ఎంపిక చేయాలని సీఎస్ అన్నారు. 

దళిత బంధు లబ్దిదారులను ఎంపిక చేసిన తరువాత లబ్దిదారులకు మార్కెట్ లో అందుబాటులో ఉండే వివిధ రకాల వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని, లబ్దిదారుల ఎంపిక పూర్తయితే నిధులను జిల్లా కలెక్టర్లకు విడుదల చేయడం ప్రారంభిస్తామని సీఎస్ అన్నారు. 

సోషల్ వెల్ఫేర్ శాఖ పరిధిలో ఇంటి పట్టాల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.  జూలై మాసంలో వచ్చిన వరదల కారణంగా పట్టాల పంపిణీ ఆలస్యమైందని, స్థానిక ఎమ్మెల్యే సమయం తీసుకుని త్వరితగతిన పంపిణీ పూర్తి కావాలని అన్నారు.  

ప్రభుత్వ కారుణ్య నియామకాల కోసం 1266 కార్యాలయ సబార్డినేట్ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ గా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య 79 విడుదల చేసిందని, దాని ప్రకారం జిల్లాలో 10 రోజులలో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ అన్నారు. కారుణ్య నియామకాల కింద డిగ్రి అర్హత ఉన్న వారికి జూనియర్ అసిస్టెంట్, మిగిలిన వారికి కార్యాలయ సబార్డినేట్ పోస్టులు కింద భర్తీ చేయాలని అన్నారు.

పోడు భూముల పట్టాల పంపిణీ జిల్లాలో చాలా శాతం పూర్తయిందని, పెండింగ్ లో ఉన్న   పట్టాలను త్వరితగతిన పంపిణీ చేయాలని అన్నారు. జిల్లాలో అటవీ భూమి తదుపరి ఆక్రమణకు గురీ కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ తెలిపారు.  ప్రభుత్వ ఉత్తర్వు 59 కింద  క్రమబద్ధీకరణ కోసం ఎంపికైన లబ్దిదారుల నుంచి రుసుము వసూలు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. 

ప్రభుత్వ ఉత్తర్వు 59 కింద పలుమార్లు నోటిసు జారీ చేసినప్పటికీ స్పందన లేని లబ్దిదారుల ఇండ్ల కూల్చివేతలు ప్రారంభించాలని సీఎస్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వు 58 కింద ఉచితంగా పేదలకు క్రమబద్ధీకరణ పూర్తి చేశామని, ప్రభుత్వ ఉత్తర్వు 59 కింద పెండింగ్ రుసుము 3 వారాలో వసూలు చేయాలని సీఎస్ పేర్కొన్నారు. 

ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు వ్యవసాయేతర నోటరీ భూముల క్రమబద్ధీకరణ కు ప్రభుత్వం  అనుమతించిందని అన్నారు. 125 గజాల కంటే తక్కువ ఉన్న నోటరి భూములను  స్టాంప్ డ్యూటీ లేకుండా క్రమబద్దికరిస్తామని, 125 గజాల కంటే ఎక్కువ ఉన్న నోటరి భూములను స్టాంప్ డ్యూటీ వసూలు చేసి క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుందని తెలిపారు. 

ఆన్ లైన్ మీ సేవా ద్వారా నోటరి భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుల స్వికరిస్తున్నామని, దీని పై పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని అన్నారు. నోటరి భూముల కింద ఇప్పటి వరకు ఆన్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని అన్నారు.  

హనుమకొండ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్  మహేందర్ జీ , జిల్లా అటవీ శాఖ అధికారి వసంత లావణ్య,జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: