ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుంచి 22 వరకు మూడు వారాల పాటు జరగనున్నాయని, ప్రజల, వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ వేడుకలను ఘనంగా విజయవంతంగా నిర్వహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టవలసిన కార్యక్రమాలపై సమీక్ష సమావేశాన్ని ఎస్పి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు మూడు వారాల పాటు సాగే ‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను’’ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని, ఎలాంటి సంఘటనలు జరగకుండా, భద్రత పరమైన ఏర్పాట్లను చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పోలీస్ శాఖ నిర్వహించే సురక్ష దినోత్సవం మరియు తెలంగాణ రన్ కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా కార్యచరణ రూపొందించాలని ఎస్పి పేర్కొన్నారు.
జూన్ 4వ తేదీ – ఆదివారం - సురక్షా దినోత్సవం
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని, సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలని ఆదేవిదంగా పోలీసుశాఖలో జరిగిన సంస్కరణలను, వాటి విశిష్టతను ప్రజలకు వివరించాలని ఎస్పి పేర్కొన్నారు. పోలీసుశాఖ సాధించిన ఘనతలను, విజయాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను చేపట్టాలనీ, పోలీసులు వాడుతున్న అధునాతన సాంకేతిక అంశాలు, షి టీమ్, డయల్ -100, సైబర్ నేరాల గురించి ప్రజలకు తెలపాలన్నరు. పోలీసు జాగిలాలు వివిధ నైపుణ్యాల గురించి ప్రదర్శన, పెట్రోలింగ్ కార్స్, బ్లూ కాట్స్ , వెహికిల్స్ తో ర్యాలీ నిర్వహించాలని ఎస్పి సురేందర్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా లోని రెండు నియోజకవర్గ కేంద్రాల్లో పోలీసు శాఖ నేతృత్వంలో ప్రజలు, యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేయాలనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి అడ్మిన్ వి. శ్రీనివాసులు, అదనపు ఎస్పి ఏఆర్ వి. శ్రీనివాస్, కాటారం డిఎస్పీ జీ. రామ్ మోహన్ రెడ్డి, జిల్లా పరిధిలోని ఇన్స్పెక్టర్ లు, ఎస్సై లు పాల్గొన్నారు.అంతకు ముందు ప్రజాదివాస్ కార్యక్రమం లో భాగంగా జిల్లా లోని వివిధ మండలాల నుంచి వచ్చిన 13 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పి సురేందర్ రెడ్డి , పిటిషన్ల పై విచారణ జరిపి చట్ట పరంగా న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.
Post A Comment: