ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ

మ‌హిళా సాధికార‌తే ల‌క్ష్యంగా స్త్రీ నిధి సంస్థ ద్వారా ప్ర‌భుత్వ ప‌రంగా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హిస్తున్న ఉచిత కుట్టు శిక్ష‌ణ‌కు కొన‌సాగింపుగా ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో సిఎస్ఆర్ (కంపెనీ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ) కింద నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాష్ట్ర  పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. ఇప్ప‌టికే పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన అనేకానేక కార్య‌క్ర‌మాల‌కు తోడుగా ఈ ఉచిత కుట్టు శిక్ష‌ణ, ఉచితంగా కుట్టు మిష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని కూడా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి వివ‌రించారు. ఈ మేర‌కు హైద‌రాబాద్ లోని డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలోని త‌న పేషీలో ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ప్ర‌తినిధులతో మంత్రి గురువారం స‌మీక్షించారు.

పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో పైల‌ట్ ప్రాజెక్ట్ కింద రూ.5 కోట్ల వ్య‌యంతో 3వేల మందికి శిక్ష‌ణ ఇస్తున్నామ‌ని తెలిపారు. ఇప్పుడు శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వాళ్ళలో అర్హులైన వాళ్ళకి వ‌రంగ‌ల్ లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్ టైల్ పార్క్ లో ఉద్యోగాలు, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. అయితే, ఈ పైల‌ట్ ప్రాజెక్టుకు కొన‌సాగింపుగా, ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో సిఎస్ఆర్ కింద మ‌రో 10వేల మందికి శిక్ష‌ణ ఇచ్చే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టామ‌ని మంత్రి తెలిపారు. ప్రస్తుత శిక్ష‌ణ పూర్తి అయిన వెంట‌నే ఆ శిక్ష‌ణ కు కొన‌సాగింపుగా, ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ‌ను కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. శిక్ష‌ణ పూర్తిచేసుకున్న వారికి స‌ర్టిఫికేట్ల పంపిణీతోపాటు, ఉచితంగా కుట్టు మిష‌న్ల‌ను పంపిణీ చేస్తామ‌ని మంత్రి వివ‌రించారు. ఇప్ప‌టికే ఈ విష‌యాల‌ను ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్ చైర్ ప‌ర్స‌న్  ఎర్ర‌బెల్లి ఉషా ద‌యాక‌ర్ రావు తో చ‌ర్చించిన‌ట్లు, ఇందుకు వారు స‌మ్మ‌తించిన‌ట్లు మంత్రి తెలిపారు.

పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా ఎదిగేవిధంగా చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని, మ‌హిళ‌లు ఆర్థికంగా ఎదిగితేనే ఆ కుటుంబం, స‌మాజం, గ్రామం, రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుంద‌ని మంత్రి అన్నారు. అలాగే నిరుద్యోగ యువ‌త కోసం కూడా ఉపాధి, ఉద్యోగావ‌కాశాల కోసం ప్ర‌త్యేకంగా ఆలోచ‌న చేస్తున్న‌ట్లు త్వ‌ర‌లో ఆ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడ‌తామ‌ని మంత్రి వివ‌రించారు.

ఈ స‌మీక్ష కు ఎర్ర‌బెల్లి ట్ర‌స్ట్ పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కో ఆర్డినేట‌ర్ పంజా క‌ల్ప‌న తదిత‌రులు హాజ‌ర‌య్యారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: