ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఉత్తర తెలంగాణలో రెండో రాజధానిగా వెలుగొందుతున్న వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ), ఎంజీఎం, సీకేఎం ఆస్పత్రులకు కొత్తగా 52 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్త పోస్టుల్లో భాగంగా వరంగల్ కు జరిపిన కేటాయింపుల పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. కొత్తగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కాకతీయ మెడికల్ కాలేజీకి 23, ఎంజీఎంకు 27, సీకేఎంకు 2 కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో కేఎంసీలో పాథాలజీ 1, పిడియాట్రిక్స్ 2, రేడియో డయాగ్నసిస్ 1, జనరల్ సర్జరీ 2, ఈఎన్టీ 1, అనస్తీషియా 9, న్యూరాలజీ 1, న్యూరో సర్జరీ 1, ప్లాస్టిక్ సర్జరీ 2, పిడియాట్రిక్ సర్జరీ 1, యూరాలజీ 1 పోస్టులు మంజూరయ్యాయి. అలాగే ఎంజీఎంలో జనరల్ మెడిసిన్ 5, పిడియాట్రిక్స్ 2, డీవీఎల్ 1, రేడియో డయాగ్నసిస్ 1, జనరల్ సర్జరీ 2, ఆర్థోపెడిక్స్ 1, అనస్థీషియా 6, రేడియేషన్ ఆంకాలజీ 2, కార్డియాలజీ 2, సీటీవీఎస్ 2, ఎండోక్రినాలజీ 1, మెడ్ గ్యాస్ట్రో 1, నెఫ్రాలజీ 1 పోస్టు మంజూరయ్యాయి. సీకేఎంలో పిడియాట్రిక్స్ 1, ఓబీజీ 1 పోస్టులు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో వరంగల్ ను హెల్త్ సిటీ ఏర్పాటుకు తగు భూమికను సిద్ధం చేసినట్లు తెలిపారు. సువిశాలమైన ఒకే ప్రాంతంలో కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం, నేత్ర వైద్యశాల తదితర వైద్యాలయాలు చోటు చేసుకున్నాయన్నారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల ఆస్పత్రి భవన విస్తరణను కూడా తాజగా పెంచినట్లు ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు. దీంతో అంచనా విలువ రూ. 1250 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆస్పత్రి నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లో ఖర్చుకు వెనక్కి తగ్గే ప్రసక్తి లేకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందుకు పోవడం పట్ల వరంగల్ జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: