ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
గ్రేటర్ వరంగల్ లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు సిక్త పట్నాయక్, ప్రావీణ్యా లు అధికారులను ఆదేశించారు.
గురువారం హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో బల్దియా, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కలెక్టర్లు సమావేశమై వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను పురోగతిని సమీక్షించారు.
జి డబుల్ ఎంసీ ద్వారా నిర్వహించే అభివృద్ధి పనులపై వారు సమీక్షిస్తూ గ్రేటర్ వ్యాప్తంగా 4 ప్రాంతాలలో ఒక్కొక్కటి ఐదు కోట్ల రూపాయల వ్యయంతో మినీ స్టేడియాలునిర్మించుటకు గాను టెండర్ ప్రక్రియ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. బంధం చెరువు అభివృద్ధి, సుందరీకరణ కొరకు 3.2 కోట్ల రూపాయలు మంజూరై టెండర్ కూడా పూర్తయినందున పనులు చేపట్టాలన్నారు. వేసవిలో గ్రేటర్ లోని అన్ని ప్రాంతాలలో త్రాగునీరు ప్రతిరోజు సక్రమంగా అందేలా నిత్యం చర్యలు తీసుకుంటు పర్యవేక్షించాలని, నీటి సరఫరా నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మానిటరింగ్ సెల్ కు వచ్చే లీకేజీలు, నీటి సంబంధం సమస్యలు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీటి సరఫరా జరగాలని ఏదైనా ఆటంకం ఏర్పడినచో ప్రత్యాయంగా ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా చేయాలన్నారు.
ముంపు నివారణ చర్యలు భాగంగా మహా నగరంలోని నాలుగు ప్రధాన నాలాలైన నయీమ్ నగర్, భద్రకాళి, బొంది వాగు, శాఖరాజకుంట, తోపాటు వాటికి అనుసంధానంగా ఉన్న ప్రధాన అంతర్గత నాలాల పూడికతీత పనులలో వేగం పెంచి వర్షాకాలం ప్రారంభం కాకముందే మే చివరి నాటికి పూర్తవ్వాలని ఆదేశించారు.
నాలాల వెంబడి నాలా మెయిన్ చైన్ లింక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా రహదారులలో ఉన్న అన్ని మ్యాన్ హోల్ లకు మూతలు ఉండేలా చూడాలన్నారు.
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కొనసాగుతున్న కాలోజీ కళాక్షేత్రం పనుల్లో వేగం పెంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే జూన్ రెండో తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రకాళీ మాడవీధుల ఏర్పాటుకు వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
వరంగల్ బస్ స్టేషన్ నూతనంగా నిర్మించుటకు గాను వచ్చే నెలలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని హనంకొండ, వరంగల్ కలెక్టర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో బల్దియా ఎస్ ఈలు ప్రవీణ్ చంద్ర, కృష్ణారావు, కుడా , బల్దియా ఈ ఈ భీమ్రావు, రాజయ్య, ఏ సి పి ప్రకాశ్ రెడ్డి, డి ఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: