భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కె. తారక రామారావు (KTR) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదంపై తీవ్రంగా స్పందించారు. కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని సుమారు 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ చర్య పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, అనేక వృక్ష, జంతు జాతులు ప్రమాదంలో పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు కేటీఆర్ తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, పర్యావరణ ప్రేమికులకు బహిరంగ లేఖ రాశారు. ఆర్థిక లాభాల కోసం ప్రభుత్వం పర్యావరణాన్ని నాశనం చేస్తోందని ఆయన విమర్శించారు. HCU విద్యార్థులు అటవీ భూములను కాపాడాలని చేస్తున్న శాంతియుత పోరాటానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. విద్యార్థులను నిందించడం, విశ్వవిద్యాలయాన్ని తరలిస్తామని బెదిరించడం ప్రభుత్వ "రియల్ ఎస్టేట్" ఆలోచనలకు నిదర్శనమని ఆయన అన్నారు.
ప్రభుత్వం "ఎకో పార్క్" పేరుతో కొత్త మోసానికి తెరలేపిందని, అడవిని సంరక్షించాల్సింది పోయి భూమిని ఆక్రమించడానికి కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. నిరసనలు కొనసాగితే HCUని వేరే ప్రాంతానికి తరలిస్తామని ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను ఆయన ఖండించారు. గచ్చిబౌలి మరియు HCUని కాపాడటానికి BRS పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి, భూముల అమ్మకాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే, BRS పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఆ లేఖలో ఆయన ఇంకా ఏమన్నారంటే:
ప్రకృతిపై ప్రేమతో, మన ఉమ్మడి భవిష్యత్తు పట్ల ఆందోళనతో ఒక సాధారణ పౌరుడిగా ఈ లేఖ రాస్తున్నాను. HCUలోని 400 ఎకరాల భూమిని రక్షించడానికి గళం విప్పిన ప్రతి విద్యార్థి, పర్యావరణవేత్త, జర్నలిస్ట్, ప్రజా వ్యక్తి మరియు పౌరుడికి నా ధన్యవాదాలు. ఇప్పటికే మా పార్టీ 400 ఎకరాల పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని ప్రకటించాము. ప్రకృతికి విఘాతం కలగకుండా, విశ్వవిద్యాలయానికి ప్రమాదం రాకుండా BRS పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుంది. ఈ భూముల్లో 734 రకాల మొక్కలు, 220 రకాల పక్షులు మరియు 15 రకాల జంతువులు ఉన్నాయి. వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అభివృద్ధి పేరుతో ఈ 400 ఎకరాల అటవీ భూమిలోని పచ్చని చెట్లను, అటవీ సంపదను నాశనం చేస్తున్నారు. దీనిని అడ్డుకోవాలి. కాబట్టి, HCU మరియు దాని చుట్టుపక్కల పచ్చదనాన్ని కాపాడుకోవడానికి ప్రజలు, విద్యార్థులు మరియు పర్యావరణ ప్రేమికులు కలిసి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Post A Comment: