పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ప్రమాదంలో మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్లకు స్వల్పంగా కాలిన గాయాలు అయ్యాయని, పొగ పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు కూడా కొంచెం ఇబ్బంది కలిగిందని సమాచారం. ప్రస్తుతం సింగపూర్‌లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్‌కు చికిత్స అందిస్తున్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్ బయలుదేరారు. ఆయన వెంట భార్య అన్నా లెజ్నోవా కూడా ఉన్నారు.
ఈ ఘటనపై పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్, తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన తమ్ముడి కుమారుడి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
సింగపూర్‌లోని రివర్ వ్యాలీ రోడ్డులో ఉన్న ఒక షాప్‌హౌస్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ భవనంలో ఒక వంట పాఠశాల కూడా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో 15 మంది విద్యార్థులు, నలుగురు పెద్దలు ఉన్నారు. వారిని వెంటనే రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది. మిగిలిన వారు స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు.
Post A Comment: