ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని 4వ పెద్దమ్మగడ్డ, 5వ డివిజన్ కొత్తూరు జెండా కమ్యూనిటీ హాళ్ళలో గురువారం నిర్వహించారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వార్డు సభలలో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు అందించిన సందేశాన్ని కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ చదివి వినిపించారు.
ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5లక్షల నుండి రూ.10లక్షలకు పెంపు గురించిన ఆరు గ్యారంటీలను అధికారం లోనికి వచ్చిన తరువాత అమలు చేస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజా ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తప్పకుండా అమలు చేస్తామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని ప్రతి డివిజన్లో ప్రభుత్వ పథకాలను అందించేందుకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి డివిజన్ లోని ప్రజలకు దరఖాస్తు పత్రాలు అందుతాయని, ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదన్నారు. ప్రజాపాలన కార్యక్రమం డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఉంటుంది కాబట్టి దరఖాస్తు పత్రాల కోసం అధైర్యపడవద్దన్నారు. ప్రభుత్వ పథకాల కోసం ప్రజలకు దరఖాస్తు పత్రాలను పూర్తిస్థాయిలో అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారన్నారు. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజా పాలనలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఈ డివిజన్ల లో ఏర్పాటుచేసిన కౌంటర్ల వద్ద అధికారులకు ప్రజలు సమర్పించారు. అదేవిధంగా కౌంటర్ల వద్ద వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండి. అజీజ్ ఖాన్, వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, సెంట్రల్ జోన్ డిసిపి ఎం. ఏ. భారి, ఏసీపీ కిరణ్ కుమార్, ఆర్డివో ఎల్. రమేష్, తహశీల్దార్ విజయ్ కుమార్, నోడల్ అధికారి మేన శ్రీను, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, తోట వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, సిబ్బంది తో పాటు ఆయా డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: