ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం హనుమకొండ జిల్లాలో గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోని పలు గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద ప్రజా పాలన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ప్రజా పాలన అభయ హస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను అధికారులు స్వీకరించిన అనంతరం దరఖాస్తుదారులకు రసీదులను అందజేశారు. దరఖాస్తులను అందజేసినందుకు వచ్చే మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లను సిద్ధం చేశారు. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం కౌంటర్ల వద్ద టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం, తదితర వసతులను కల్పించారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు.
గ్రామ సభలను సందర్శించిన అదనపు కలెక్టర్
డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు జరగనున్న ప్రజా పాలన గ్రామసభలు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జరుగనున్నాయి. ప్రజా పాలన కార్యక్రమం తొలి రోజు అయిన గురువారం హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా గ్రామ సభలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. పరకాల లోని సిఎస్ఐ స్కూల్ లో ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీ స్కీమ్ ల దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లను ఏర్పాటు చేయగా వాటిని గురించి, అక్కడ కల్పించిన వసతులను మునిసిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామిని అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల కోసం వచ్చే ప్రజలు దరఖాస్తు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఉండాలన్నారు. ప్రజల నుండి ఎన్ని దరఖాస్తు లు వచ్చాయానే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కమలాపూర్ మండలంలోని గూనిపర్తి లోని గ్రామసభ ను సందర్శించారు. అక్కడి వివరాలను స్థానిక అధికారులను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ రాధిక గుప్తా విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: