మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్/ హైదరాబాద్: అసలే నిధుల కటకట.. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితి. వృద్ధులు, దివ్యాంగులకు ఆసరా పింఛన్లు కూడా ఆలస్యమవుతున్న పరిస్థితి. వివిధ వర్గాల కోసం ప్రకటించిన సంక్షేమ పథకాలకూ నిధులు సర్దలేని ఇబ్బంది. మరోవైపు.. సమీపిస్తున్న ఎన్నికలు. దీంతో ప్రభుత్వం హడలెత్తిపోతోంది. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ ఉపసంహరణకు కూడా పైసలు పూర్తిస్థాయిలో లేవు. దీంతో జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు సర్కారు ఎపుడు ఇస్తుందోనని ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ మానసపుత్రిక అయిన దళితబంధు పథకం రెండో విడతకు సరిపడా నిధులు లేకపోవడంతోనే దాని అమలులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీసీలకు రూ.లక్ష సాయం పథకానికి అవసరమైన నిధులనూ ప్రభుత్వం పూర్తిస్థాయిలో బీసీ కార్పొరేషన్‌కు అందించలేదు. గొర్రెల పంపిణీ పథకం అమలు నత్తనడకన సాగుతోంది. ఇక గృహలక్ష్మి పథకం ప్రకటనలకే పరిమితమవుతోంది. రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన రుణమాఫీ పథకం ఏళ్లు గడుస్తున్నా పూర్తికాలేదు. ఇందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా ఖర్చు చేయడంలేదు. వాస్తవానికి ఈ పథకాన్ని డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకంతోపాటే కొనసాగిస్తామని, సొంత స్థలం కలిగి ఉన్న పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5-6 లక్షల ఆర్థిక సాయం చేస్తామని 2018 మేనిఫెస్టోలోనే బీఆర్‌ఎస్ ప్రకటించింది. కానీ, చివరికి ఆర్థిక సాయంలో కోత విధిస్తూ రూ.3లక్షలే ఇస్తామని మాట మార్చింది. అది కూడా ఇంతవరకూ అమలు కాలేదు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నింటినీ పూర్తిగా కాకున్నా.. కొంత మేర అయినా అమలు చేయాలన్నా కోట్ల రూపాయలు కావాలి. కానీ, అవీ లేకపోవడంతో పథకాలన్నీ నామ్ కేవాస్తే అన్నట్టుగా తయారయ్యాయి.
*రుణమాఫీ పూర్తయ్యేనా?*
రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న సర్కారు.. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిగా చేయలేదు. దీంతో అసలు రుణమాఫీ జరుగుతుందా? లేదా? అని రైతులు చర్చించుకుంటున్నారు. ఈ హామీ ఇచ్చే నాటికి రుణమాఫీకి రూ.21,557 వేల కోట్లు అవసరం పడుతాయని సర్కారు నిర్ధారించింది. కానీ, వీటిలో ఇప్పటివరకు 5.42 లక్షల మంది రైతులకు రూ.1,207.37 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ఇంకా రుణమాఫీ కోసం మరో రూ.20,351 కోట్లు కావాల్సి ఉంది. కానీ 2023-24 బడ్జెట్‌లో మాత్రం రుణమాఫీకి కేవలం రూ.6,385 కోట్లనే కేటాయించారు. ఈ నిధులను మినహాయించినా.. ఇంకా రూ.13,966 కోట్లు కావాల్సి ఉంది. దీంతో ఈ ఏడాది రుణమాఫీ పూర్తిగా జరగదని నిధుల కేటాయింపుతోనే స్పష్టమవుతోంది. కానీ, ప్రభుత్వం మాత్రం జమ చేస్తామనే చెబుతోంది. మరోవైపు గొల్ల, కురుమలకు అందిస్తామన్న గొర్రెల పంపిణీ పథకంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పథకానికి నేషనల్ కో ఆపరేటివ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) బ్యాంకు రుణాన్ని మంజూరు చేస్తుందని భావించినా.. ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ పథకానికి తన ఖజానా నుంచే నిధులను వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పథకం అమలుకు రూ.4 వేల కోట్లకు పైగా నిధులు అవసరం కావడంతో.. ఇప్పటికిప్పుడు అన్ని నిధులు ఎలా? అన్న చర్చ మొదలైంది.
*దళితబంధు రెండు విడతపై సందిగ్ధం..*
దళితబంధు రెండో విడత అమలు విషయంలోనూ సందిగ్ధం నెలకొంది. ఇప్పటికిప్పుడు రెండో విడతను అమలు చేయాలంటే ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారుల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1,29,800 మందికి అందించాలి. అంటే ఇందుకు దాదాపు రూ.12,900 కోట్లు అవసరమవుతాయి. అందరికీ కాకపోయినా.. సగం మందికి అంటే నియోజకవర్గానికి 650 మందికి చొప్పున అందించినా రూ.5,500 కోట్లు కావాలి. కానీ, ఇంతమందికి ఇప్పుడు అందించగలమా.. అన్నదానిపై ప్రభుత్వం యోచిస్తోంది. ఇక బీసీలకు రూ.లక్ష సాయం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాలో పొందుపరిచిన కులాల వారికి లబ్ధి చేకూరాలంటేనే దాదాపు రూ.4,500 కోట్లు అవసరమవుతాయి. కానీ, మొదటివిడత కింద బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నట్టు రెండు దశల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలోనూ రూ.100 కోట్లే విడుదల చేసినట్లు తెలుస్తోంది. దీంతో పూర్తిస్థాయిలో పథకం అమలుకు ఇబ్బందులు తప్పవని స్పష్టమవుతోంది.
*సకాలంలో అందని వేతనాలు..*
పథకాల సంగతి అటుంచితే.. ఉద్యోగులకు నెలానెలా అందాల్సిన జీతాలు కూడా సమయానికి అందడంలేదు. జీపీఎ్‌ఫలో నుంచి తమ అవసరాలకు కొంత నగదును తీసుకోవాలన్నా సర్కారు అనుమతి కావాల్సిందే. అందునా.. ఉద్యోగి కోరిన మేరకు పైసలు అందవు. ప్రభుత్వం ఇవ్వదల్చుకున్నంతే ఇస్తున్నదంటూ ఉద్యోగులు వాపోతున్నారు. మరోవైపు ఉద్యగ విరమణ చేస్తున్న వారికీ అందాల్సిన ప్రయోజనాలు సరిగా అందడంలేదన్న విమర్శలు వస్తున్నాయి..
Post A Comment: