ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

అర్హులకు పోడు భూముల పట్టాలు అందించేందుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.  

శనివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కోండా సురేఖ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క

తో కలిసి పోడు భూముల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో 

జిల్లా కలెక్టరేట్ పి ప్రావీణ్య, డీఎఫ్ఓ లావణ్యతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

రాష్ట్రంలో అటవీ భూముల విస్తీర్ణం, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ చట్టం, జారీ చేసిన పోడు భూముల పట్టాలు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు మొదలగు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నత అధికారులు వివరించారు. 

ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం 13 డిసెంబర్ 2005 నాటికి సాగు చేస్తున్న గిరిజనులు, లేదా 13 డిసెంబర్ 2005 నాటికి మూడు తరాలపాటు సాగు చేసిన గిరిజనేతరులకు పోడు భూముల పట్టాల పంపిణికి అర్హులని అధికారులు పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,30,735 మంది అర్హులను గుర్తించి వారికి 6,69,676 ఎకరాల అటవీ భూమి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఆమోదించిన ఆర్ఓఎఫ్ఆర్ దరఖాస్తుల పట్టాలు లబ్ధిదారునికి చేరాయో లేదో నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. 

మన రాష్ట్రంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన పోడు పట్టాల వివరాలు, పెండింగ్ ఉన్న దరఖాస్తులు, ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో సాగు జరుగుతున్న అటవీ భూముల వివరాలతో కూడిన నివేదిక అటవీశాఖ, గిరిజన శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా రూపొందించి సమర్పించాలని మంత్రి ఆదేశించారు. 

పోడు భూముల పట్టాల కోసం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అర్హత ఉంటే వారికి పట్టాలు పంపిణీకి చర్యలు తీసుకోవాలని, సదరు దరఖాస్తును తిరస్కరించే పక్షంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ నివేదిక అందించాలని అన్నారు.

ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం గతం నుంచి సాగు చేసుకుంటున్నా అటవీ భూములకు మాత్రమే పట్టాలు అందించాలని, కొత్తగా రాష్ట్రంలో ఇంచ్ అటవీ భూమి కూడా సాగు చేయడానికి వీలు లేదని, అటవీ భూముల సంరక్షణకు అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నూతన ఆక్రమణలు జరగడానికి వీలులేదని మంత్రి స్పష్టం చేశారు. 

ఆర్ఓఎఫ్ఆర్ చట్టం పై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర గిరిజనులకు, ఆదివాసీలకు మాత్రమే పట్టాలు మంజూరు చేయాలని, వలస వచ్చి నూతనంగా అటవీ ప్రాంతంలో చెట్లు నరికివేత చేయాలని చూస్తే కఠినంగా వ్యవహరించాలని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, గిరిజనులకు అటవీశాఖ వ్యతిరేకం అనే భావన తొలగించే విధంగా పని చేయాలని అన్నారు. కొత్తగా అడవుల నరికివేత జరగకుండా అటవీ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అటవీ భూములు చెట్ల నరికివేత వల్ల కలిగే నష్టాలను విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి తెలిపారు. అటవీ భూముల్లో స్మగ్లింగ్ జరగకుండా పక్కా నిఘా ఏర్పాటు చెయ్యాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

పెండింగ్ పోడు భూముల పట్టా దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని సూచించారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్ట ప్రకారం అర్హులందరికీ పట్టాలు అందజేయాలని తెలిపారు.  

అటవీ భూముల అనుమతుల కారణంగా గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రోడ్డు సౌకర్యం, త్రాగు నీరు, ఆసుపత్రి వంటి మౌలిక వసతుల కల్పన పనులకు అటవీ అనుమతులు త్వరగా వచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. 

పట్టాలు మంజూరు చేసిన పోడు భూములలో రైతులు పామ్ ఆయిల్, జీడి మామిడి తోటలు మొదలగు లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులకు అవసరమైన సహకారాలు, సూచనలు అందించాలని మంత్రి తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: