ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;హనుమకొండ జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, వైద్యాధికారులు అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలను అందించాలని సీజనల్ వ్యాధుల నియంత్రణ పర్యవేక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న వైద్య సదుపాయాలపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, వివిధ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, పర్యవేక్షణ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. హనుమకొండ జిల్లాకు డెడికేటెడ్ కలెక్టర్ గా స్నేహ శబరీష్ ఉన్నారని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కు సీజనల్ వ్యాధుల నియంత్రణ, పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా తనను నియమించిందని పేర్కొన్నారు. బుధవారం రోజున హనుమకొండ జిల్లా పరిధిలోని వంగపహాడ్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశామని తెలిపారు. అదేవిధంగా సిద్దాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించినట్లు చెప్పారు. గ్రామాలు, వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలని, మురుగు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు సిబ్బంది అప్రమత్తం గా ఉండాలన్నారు. డెంగ్యూ కేసుల పట్ల ఇక్కడి వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు ఎంతో బాగున్నాయని అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలలో గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యులను చేయాలని సూచించారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్, తదితర వ్యాధుల నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఎవరైనా సీజనల్ వ్యాధుల బారిన పడినట్లయితే అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్సను అందించాలన్నారు. గ్రామాలలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు.
హెచ్ఐవి నియంత్రణలో భాగంగా అనుమానిత లక్షణాలతో ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేయించి వారి జీవన ప్రమాణాన్ని పెంచే విధంగా కృషి చేయాలని వైద్యాధికారులకు సూచించారు. వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి పేషెంట్లకు వైద్య సేవలు అందించాలని, క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలను నిర్వహించాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో డ్రై డే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశాలు, ఏఎన్ఎంలతో గ్రామాలలో ఫీవర్ టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సమీక్షా సమావేశంలో ముందుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ డెంగ్యూ కేసులు ఉన్నచోట్లా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వైరల్, ఫివర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు
జనవరి నుండి ఇప్పటి వరకు మలేరియా పొజిటీవ్ ఒక కేసు, డెంగ్యూ పాజిటివ్ కేసులు 48 వరకూ నమోదయ్యాయని తెలియజేశారు. గత సంవత్సరం 182 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. డీపీవో లక్ష్మీ రమాకాంత్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో ఉన్న తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించినట్లు తెలిపారు. మురుగు నీరు నిలవకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దోమల నివారణ చర్యల్లో భాగంగా ఆయిల్ బాల్స్ వేస్తున్నామని, దోమల లార్వా పెరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ బాగుండే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్వో డాక్టర్ మదన్ మోహన్ రావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ గౌతమ్ చౌహన్, వివిధ ఆసుపత్రుల వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.